ప్రహ్లాద చరిత్ర అను ఈ పాఠం డిగ్రీ…
FINANCIAL ACCOUNTING 1 – Degree 1st…
FIT IMPORTANT QUESTIONS – Degree semester…
Business Economics Previous Question Papers –…
Degree Courses, Notes, PDF's, Materials, Videos & More!
ప్రహ్లాద చరిత్ర అను ఈ పాఠం డిగ్రీ మొదటి సంవత్సరం, రెండవ సెమిస్టర్‌లోని మొదటి యూనిట్‌కు చెందిన మూడవ పాఠ్యాంశము. భారతీయ సనాతన ధర్మంలో, భక్తి సాహిత్యానికి విశేషమైన స్థానం ఉంది. అందులో మహాకవి బమ్మెర పోతనామాత్యుడు రచించిన శ్రీమదాంధ్ర భాగవతంలోని ఈ ‘ప్రహ్లాద చరిత్ర’ ఘట్టం ఎంతో అద్భుతమైనది మరియు పవిత్రమైనది. “ఓం నమో భగవతే వాసుదేవాయ నమః” అనే అష్టాక్షరీ మహా మంత్రం ప్రాముఖ్యత ఈ పాఠ్యాంశం ద్వారా స్పష్టమవుతుంది. ఈ కథాంశం ఆధారంగా 2025లో వచ్చిన ‘మహా అవతార్ నరసింహ’ చలనచిత్రం చూసిన వారికి ఈ పాఠ్యాంశం దృశ్యరూపంగా మరింత సులభంగా అర్థమవుతుంది.
పూర్వం దానవ అను వంశంలో అత్యంత శక్తివంతమైన ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారి పేర్లు 1.హిరణ్యాక్షుడు మరియు 2.హిరణ్యకశిపుడు. వీరిద్దరూ స్వయాన అన్నదమ్ములు. అసుర (రాక్షస) జాతికి చెందిన ఈ ఇద్దరూ లోకాలను గడగడలాడించేవారు. కాలక్రమంలో హిరణ్యాక్షుడు లోక కంటకుడై వ్యవహరిస్తున్నప్పుడు… శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని దాల్చి హిరణ్యాక్షుని వధించాడు. తన అన్న మరణ వార్త విన్న హిరణ్యకశిపుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన సోదరుని మరణానికి కారణమైన విష్ణుమూర్తిపై తీవ్రమైన కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని దృఢ నిర్ణయం చేసుకున్నాడు..
విష్ణువును ఎదిరించాలంటే తనకు విశేషమైన శక్తులు, వరం కావాలని హిరణ్యకశిపుడు గ్రహించాడు. అందుకోసం సృష్టికర్త అయిన బ్రహ్మదేవునీ గురించి అత్యంత కఠోరమైన తపస్సు ఆచరించాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, హిరణ్యకశిపుడు ఒక విలక్షణమైన వరాన్ని కోరుకున్నాడు. “నేను మనిషి చేత కానీ, జంతువు చేత కానీ మరణించకూడదు. పగలు కానీ, రాత్రి కానీ మరణం రాకూడదు. భూమిపై కానీ, ఆకాశంలో కానీ నా ప్రాణాలు పోకూడదు. సృష్టిలోని ఎలాంటి ఆయుధంతోనూ నన్ను ఎవరూ చంపలేకపోవాలి” అని వరం అడిగాడు. బ్రహ్మదేవుడు ఆ వరాలను ప్రసాదించాడు. ఈ వరాల బలంతో తనను ఎవరూ చంపలేరని భావించిన హిరణ్యకశిపుడు తీవ్రమైన అహంకారంతో విర్రవీగాడు. దేవతలను అవమానించడం, తానే దేవుడినని అందరికీ ప్రకటించుకోవడం, విష్ణు భక్తులను హింసించడం ప్రారంభించాడు. విష్ణువు పేరు వినపడితేనే కన్నెర్రజేసేవాడు.
ప్రహ్లాదుని జననం – తండ్రి ఆరాటం: ఈ హిరణ్యకశిపుడికి మరియు అతని భార్య లీలావతికి జన్మించిన కుమారుడే ప్రహ్లాదుడు. ఒక రాక్షస రాజు కడుపున పుట్టినప్పటికీ, ప్రహ్లాదునిలో అసుర బుద్ధి మాత్రం రాలేదు. అతడు చాలా సద్గుణాలు కలిగిన బాలుడు, ఎంతో ఉత్తముడు. (దీనికి గల కారణం నారద మహాముని ఉపదేశం అనేది మరో ఇతిహాస కథ).
హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడు భవిష్యత్తులో ఒక గొప్ప రాక్షస రాజుగా ఎదగాలని, రాజసంతో, పౌరుషంతో దానవ సామ్రాజ్యాన్ని పాలించాలని ఆశపడ్డాడు. కానీ ప్రహ్లాదునికి రాజ్యం మీద ఆసక్తి లేదు. ఒక రాజకుమారుడికి ఉండవలసిన ధైర్యం, క్రూరత్వం ప్రహ్లాదునిలో కనబడలేదు. ఎప్పుడూ చాలా బలహీనంగా, మౌనంగా ఉండేవాడు. ఇది గమనించిన హిరణ్యకశిపుడు, “నా కుమారుడికి చదువు, విద్య నేర్పిస్తే మనసు మారుతుంది. చురుకుదనం పెరుగుతుంది” అని భావించాడు. ప్రహ్లాదుని ప్రేమగా దగ్గరకు పిలిచి, “నాయనా ప్రహ్లాదా! చదువుకోని వాడు అజ్ఞాని. విద్యాభ్యాసం వల్ల ఏది మంచి, ఏది చెడు అని తెలుస్తుంది. కాబట్టి నీవు తప్పక చదువుకోవాలి” అని విద్యాభ్యాసం యొక్క ఆవశ్యకతను వివరించాడు.
గురుకులానికి పంపడం – ప్రహ్లాదుని విద్యాభ్యాసం: రాక్షసుల గురువైన శుక్రాచార్యుని కుమారులను హిరణ్యకశిపుడు తన ఆస్థానానికి పిలిపించాడు. వారి పేర్లు చండుడు మరియు అమర్కుడు (చండామార్కులు). వారిని ఎంతో గౌరవించి, “ఓ గురువులారా! నా కుమారుడు ప్రహ్లాదుడు అజ్ఞానంలో ఉన్నాడు. అతనికి రాజనీతి గానీ, నా పౌరుషం గానీ ఏమీ తెలియడం లేదు. దయచేసి మీరు వీనికి సకల గ్రంథాలు చదివించండి. రాక్షస విద్యలు, నీతి శాస్త్రాలు నేర్పించి, నా అసుర వంశాన్ని రక్షించే సమర్థుడిగా మార్చండి” అని ప్రహ్లాదుని విద్యా బాధ్యతను వారికి అప్పగించాడు.
చండామార్కులు ప్రహ్లాదుని ఇతర రాక్షస విద్యార్థులతో కూర్చోబెట్టి అనేక శాస్త్రాలు బోధించారు. ప్రహ్లాదుడు గురువులు చెప్పింది శ్రద్ధగా విన్నాడు. తనకు ఇష్టం లేని దానవ విద్యలు బోధించినా మౌనంగా ఉన్నాడు. కానీ, అంతరంగంలో మాత్రం ఎప్పుడూ ఆ మహావిష్ణువును తలుచుకుంటూనే ఉండేవాడు. విష్ణుమూర్తిపై భక్తితోనే తన విద్యార్జన కొనసాగించాడు.
హిరణ్యకశిపుని తొలి పరీక్ష: కొన్ని రోజుల తర్వాత తండ్రి హిరణ్యకశిపుడు గురుకులానికి వచ్చాడు. ఆనందంతో ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని, “నాయనా! గురువులు చెప్పిన పాఠాలలో నీకు బాగా నచ్చింది, ఇష్టమైన మంచి విషయం ఏమిటో చెప్పు” అని అడిగాడు. ప్రహ్లాదుడు ప్రశాంతంగా, “తండ్రీ! గురువులు చెప్పిన వాటిలో నాకు నచ్చింది ఒక్కటే.. అదే ‘విష్ణు నామస్మరణం’. ప్రపంచంలోని మనుషులు ‘మేము, మీరు’ అనే భేద భావంతో ఉంటారు. కానీ నిజానికి ఈ సృష్టి అంతా ఆ భగవంతుని లీల. సంపదలు, రాజ్యాలు వదిలి అడవిలో నివసించినా సరే, భక్తితో జీవించడమే ఉత్తమం. భక్తే అన్నిటికంటే గొప్పది” అని నిర్మొహమాటంగా బదులిచ్చాడు.
తండ్రి ఆగ్రహం – గురువుల మందలింపు: తన కొడుకు శత్రువైన విష్ణువును పొగడటం విని హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి, తీవ్రంగా కోపగించాడు. “ప్రహ్లాదా! ఈ మాటలు నీకు ఎవరు నేర్పారు? విష్ణువు మన రాక్షస జాతికే శత్రువు. అతడిని ద్వేషించాలి గానీ ‘హరి, గిరి’ అని జపిస్తూ అజ్ఞానంలో పడిపోకు” అని హెచ్చరించాడు. అప్పుడు ప్రహ్లాదుడు, “తండ్రీ! అయస్కాంతం (Magnet) దగ్గరకు ఇనుము లాగబడినట్లు నా మనసు విష్ణుమూర్తి వైపు ఆకర్షితమవుతోంది. తేనెను తాగే తుమ్మెద మందార పువ్వును వదిలి ఉమ్మెత్త పువ్వు దగ్గరకు వెళుతుందా? నా మనసు కూడా అలానే విష్ణు పాదాలను ధ్యానించడంలోనే ఆనందం పొందుతుంది. దేవుని భక్తికి మించిన మార్గం లేదు” అని నిస్సంకోచంగా పలికాడు ప్రహ్లాదుడు.
ఇది విన్న హిరణ్యకశిపుడు కోపంతో పెదవులు కొరుక్కుని, గురువులైన చండామార్కుల వైపు చూసి, “నిజమైన బ్రాహ్మణులు కారు మీరు. మీరు శత్రువుల కథలు వీడికి నేర్పారా?” అని మండిపడ్డాడు. భయపడిన గురువులు ప్రహ్లాదుని చూచి – “చిన్నవాడివైనా ఎక్కువగా మాట్లాడుతున్నావు, రాక్షస జాతికి మచ్చ తెచ్చావు” అని కోప్పడ్డారు. వారి తప్పు లేకయిన చండమార్కులు భయపడి రాజు కాళ్లపై పడి- “మహారాజా! ఇందులో మా తప్పు లేదు, వీడిని భయపెట్టి, అవసరమైతే కొట్టి అయిన… మళ్ళీ దారిలో పెడతాము” అని వేడుకున్నారు చండమార్కులు.
నవవిధ భక్తులు – మలి విద్యాభ్యాసం తర్వాత ప్రహ్లాదుని సమాధానం: గురువులు ప్రహ్లాదుని ఒంటరిగా తీసుకెళ్లి ధర్మ, కామ, అర్థ శాస్త్రాలు, సామ దాన భేద దండాలనే రాజనీతులు బోధించి, మళ్ళీ విష్ణువు పేరు ఎత్తకూడదని గట్టిగా బెదిరించి సభకు తీసుకువచ్చారు. “మేము వీడికి సకల విద్యలు నేర్పించాము, పరీక్షించండి” అని రాజుతో అన్నారు. హిరణ్యకశిపుడు మళ్ళీ ప్రహ్లాదుని ప్రేమగా ఒడిలో కూర్చోబెట్టుకుని పరీక్షించగా, ప్రహ్లాదుడు ఇలా అన్నాడు: “తండ్రీ! చదువులన్నింటిలో ఉన్న ముఖ్యమైన సారాంశం, రహస్యం అర్థం చేసుకున్నాను. చదువులన్నింటికీ అసలు భావం భక్తి మార్గమే”.
అలా చెబుతూ ప్రహ్లాదుడు నవవిధ భక్తులను (తొమ్మిది మార్గాలను) వివరించాడు:
“హరి భక్తి అనేది ఒక నౌక (పడవ) లాంటిది. సంసారమనే సముద్రాన్ని దాటించేది ఆ భక్తి నౌక మాత్రమే. ఇతర జ్ఞానాల కంటే భక్తే గొప్పది” అని స్పష్టం చేశాడు ప్రహ్లాదుడు.
ఈ మాటలు వినగానే హిరణ్యకశిపునికి కట్టలు తెంచుకున్నంత కోపం వచ్చింది. కొడుకుపై ఉన్న ప్రేమ పోయి, విపరీతమైన ఆవేశంతో ప్రహ్లాదుని తన ఒడిలో నుంచి బలంగా కిందికి నెట్టేశాడు. అప్పుడు తన మంత్రులతో ఈ విధంగా హిరణ్యకశిపుడు అన్నాడు – “వీడు మన శత్రువైన విష్ణువును భజిస్తున్నాడు. జాతికే విరోధిగా మారాడు. తండ్రికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. వీడు నాకు కొడుకు కాడు” అని అరుస్తూ, ప్రహ్లాదుని కఠినంగా శిక్షించడానికి సిద్ధమయ్యాడు. పాఠ్యాంశం ప్రధానంగా ఇక్కడితో ముగుస్తుంది.
దీని తర్వాత కథలో, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పర్వతాలపై నుంచి తోయించడం, పాములతో కరిపించడం, అగ్నిలో వేయడం లాంటి ఘోరమైన శిక్షలు అమలు చేస్తాడు. కానీ ప్రహ్లాదుడు “ఓం నమో భగవతే వాసుదేవాయ” అని జపిస్తూనే ఉంటాడు. ఆ వాసుదేవుడే ప్రహ్లాదుని ప్రతిసారీ కాపాడి, చివరకు స్తంభం నుంచి ఉగ్ర నరసింహ అవతారంలో (సగం సింహం, సగం మనిషి) వచ్చి, తన వాడియైన గోర్లతో హిరణ్యకశిపుని కడుపు చీల్చి సంహరిస్తాడు. ధర్మాన్ని నిలబెడతాడు.
భక్తికి, స్థితప్రజ్ఞతకు ఈ “ప్రహ్లాద చరిత్ర” ఒక అద్భుతమైన ఉదాహరణ. పోతనామాత్యుని రచనా శైలి, భక్తి తత్వం ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థులలో ఆదర్శ భావాలను పెంపొందిస్తాయి. మీకు ఈ పాఠ్యాంశంపై ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి.
వేరే ఇతర లెసన్స్ కూడా కింద చదవండి – డిగ్రీ 2nd సెమిస్టర్
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.